BRS Protest against Singareni privatization: ప్రధాని మోదీ ఈనెల 8న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ మేరకు సింగరేణి జిల్లాల్లో మహా ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సింగరేణి కార్మికులు అనేకసార్లు కోరినప్పటికీ.. కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చిందన్నారు.
BRS Maha Dharna in Singareni : వేలం లేకుండా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేటీఆర్ అన్నారు. ప్రైవేటీకరణ చేయబోమని మాటిచ్చి నిలుపుకోలేక పోయిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణను తెరపైకి తెస్తోందని కేటీఆర్ ఆరోపించారు. లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం... సింగరేణిని సైతం అమ్మాలని చూస్తుందని మండిపడ్డారు.
BRS Maha Dharna in Singareni Tomorrow : లాభాల బాటలో ఉన్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని మంత్రి దుయ్యబట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన కేంద్రం.. సింగరేణికి కూడా బొగ్గు గనులను కేటాయించాలని కోరితే.. పెడచెవిన పెట్టిందన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌పై అపార ప్రేమ చూపుతున్న ప్రధాని.. ప్రగతిశీల తెలంగాణపై వివక్ష చూపుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.