Telangana New Secretariat Photos: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సచివాలయం భవనానికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్విటర్ అంకౌంట్ ద్వారా పంచుకున్నారు. తుది దశలో ఉన్న సచివాలయం, అమరవీరుల స్మారకం చిత్రాన్ని "గ్లోరియస్ వ్యూ ఆఫ్ హైదరాబాద్" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సాయంత్రం వేళ సూర్యుని కాంతి ఓ వైపు.. విద్యుత్ దీపాలతో మరోవైపు వెలుగుతున్న రెండు ప్రతిష్టాత్మక నిర్మాణాల చిత్రాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చిత్రంలో ప్రత్యేకించి అమరవీరల స్మారకం స్టెయిన్ లెస్ స్టీల్ క్లాడింగ్‌పై సూర్యుని కాంతి వెలుగుల్లో మేఘాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల స్మారకం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆ రోజు సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు.. త్వరలోనే ప్రారంభానికి సంబంధించి తేదీ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రూ.700కోట్లతో నూతన భవనం: నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారుగా రూ.700 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమవుతోంది. నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. అధికారులు ఉరుకులు పరుగుల మీద రాత్రింబవళ్లు పనులు చేయిస్తున్నారు. ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఇక్కడే ఏర్పాటు చేశారు.