KTR davos tour: తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్ లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం, ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు. 250 మందితో 2019లో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌లో.. ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పెప్సికో వెల్లడించారు. ఈ సంఖ్యను 4 వేలకు పెంచనున్నట్లు స్పష్టం చేశారు.
ఏడాదికాలంలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సీకో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపైన కేటీఆర్, రాబర్టో చర్చించారు. పెప్సికో నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్... విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు.
అలాక్స్ నుంచి రూ.750కోట్ల పెట్టుబడి: మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు బ్యాటరీల తయారీలో ఎంతో పేరున్న అలాక్స్ సంస్థ ముందుకొచ్చింది. 750 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఉత్పత్తి చేయనున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామన్న అలాక్స్ ప్రతినిధులు... భవిష్యత్తులో పది గిగావాట్ల సామర్థ్యానికి పెంచి 2030 నాటికి మొత్తంగా 750 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు.