KTR On Crop Damage: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్నదాతలు ఎటువంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల కర్షకులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Crop Damage in Telangana : ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలని.. స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కేటీఆర్ కోరారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఇందులో భాగంగానే ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలన్నీ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు ఫోన్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై వివరాలు అందించాలని సూచించారు.
'ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు.. రైతులకు భరోసా ఇవ్వాలి. అన్నదాతలు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతుల పట్ల అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమిది. రానున్న రెండ్రోజులు భారీ వర్ష సూచన ఉంది. అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.' - కేటీఆర్, మంత్రి