చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్ ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వహించిన టెక్స్టైల్, అపారెల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి పాల్గొన్న మంత్రి కేటీఆర్... రాష్ట్రంలో పరిశ్రమలకున్న సానుకూలతలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సాగయ్యే పత్తి.. అంతర్జాతీయంగా అద్భుతమైన నాణ్యత కలిగిందని దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగవుతోందని.. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సరళతర వాణిజ్యవిధానంలో అగ్రస్థానంలో ఉన్నామన్న మంత్రి.... టీఎస్-ఐపాస్ ద్వారా కేవలం పక్షం రోజుల్లోనే అనుమతులు లభిస్తాయని వివరించారు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్, నీటిసరఫరా అందిస్తామన్నారు.
ఇది ప్రాధాన్య రంగం
పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులు, సిబ్బంది కోసం ప్రభుత్వమే స్వయంగా శిక్షణ ఇస్తున్న అంశాన్ని కేటీఆర్ పెట్టుబడిదారులకు తెలిపారు. టెక్స్టైల్ రంగం తెలంగాణ ప్రభుత్వానికి ప్రాధాన్య రంగమని, అందుకే సంబంధిత పరిశ్రమ వర్గాలతో మాట్లాడి ఉత్తమ టెక్స్టైల్, అపారెల్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో తమ పరిశ్రమ ఏర్పాటు, అనుభవాన్ని సదస్సులో వివరించిన వెల్‌స్పన్ కంపెనీ సీఈఓ దీపాలీ గోయంకా.. పరిశ్రమలు నడిపేందుకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తెలంగాణను అభివర్ణించారు. దీర్ఘకాల ధృక్పథం కలిగిన స్నేహపూర్వక నాయకత్వం రాష్ట్రానికి ఉందని కొనియాడారు.
తెలంగాణ ఆరేళ్లుగా తనదైన విధానాలు, నాయకత్వంతో పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడుతోందని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాల వలెనే కాక, అంతకుమించిన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్ ప్రకటనను ఉటంకిస్తూ... రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని ప్రధాని మోదీ 'కాంపిటీటివ్ ఫెడరలిజం'గా ప్రస్తావిస్తారని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?