KTR AND BANDI SANJAY TWEET WAR: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు ఇంటా.. బయటా బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బహిరంగంగానే కాకుండా సోషల్ మీడియాలో సైతం అదే రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు గురించి బీఆర్ఎస్.. బీజేపీపై ధ్వజమెత్తితే.. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీజేపీ.. బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇప్పుడు తాజాగా టీఎస్పీఎస్సీ కేసులో విపక్షాలు అన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేసే పరిస్థితికి వచ్చింది.
అయితే తాజాగా ఉగాది రోజున అందరూ పండగ చేసుకుంటే మాత్రం మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ మాత్రం ట్వీట్లతో వార్ కొనసాగించారు. ముందుగా మంత్రి కేటీఆర్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ఈరోజు పంచాంగం అనేది ప్రత్యేకమైనందున ఆ రీతిలోనే ట్విటర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదాయం అదానీకి.. వ్యయం ఏమో జనానికి, బ్యాంకులకు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఇంకా అవమానం నెహ్రూకి.. రాజపూజ్యం ఏంటా అంటే గుజరాతీ గుంపులకీ అన్నట్లు ట్వీట్‌ను కొనసాగించారు. మళ్లీ బస్, బభ్రాజీమానం భజగోవిందం!, దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం! అంటూ ముగింపు నిచ్చారు.
ఆ తర్వాత కేటీఆర్ ట్వీట్‌కు సమాధానంగా బండి సంజయ్ సైతం ఘాటుగానే ట్వీట్ చేశారు. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం తెలంగాణ రాష్ట్రానికి అంటూ విమర్శిస్తూ రీట్వీట్ చేశారు. అయితే అవమానం ఉద్యమ వీరులకు, అమర వీరుల త్యాగాలకు అంటూ.. మరి రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. తుస్.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే అంటూ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ ద్వారా హెచ్చరించారు.