కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీశైలంలో సమావేశం కానుంది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న ఈ ఉపసంఘంలో రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్లు, జెన్‌కో సీఈలతోపాటు బోర్డులోని ఇంజినీర్లతో కలిపి మొత్తం తొమ్మిది మంది సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 14కు ముందు ఇది సమావేశమై ఏయే ప్రాజెక్టులు, అవుట్‌లెట్‌లు తీసుకోవాలన్నదానిపై విస్తృతంగా చర్చించింది.
‘తెలంగాణ అప్పగిస్తేనే’
ఆంధ్రప్రదేశ్.. శ్రీశైలం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌తోపాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్టులు, కుడి విద్యుత్తు కేంద్రం బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ‘తెలంగాణ అప్పగిస్తేనే’ అనే షరతు పెట్టింది. తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని కోరినందున ఏ ప్రాజెక్టును అప్పగించలేదు. విద్యుదుత్పత్తి కేంద్రాలు ఇప్పుడిప్పుడే అప్పగించేది లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కల్వకుర్తి మొదటి లిఫ్టుతో పాటు నాగార్జునసాగర్ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమకాలువలు బోర్డుకు అప్పగించడం గురించి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదు.
ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ
గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రారంభమై వారం దాటినా ఇప్పటివరకు బోర్డు పరిధిలోకి ఒక ప్రాజెక్టుకానీ, కాలువ కానీ రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోనే రెండు రోజులపాటు ఉప సంఘం సమావేశం జరగనుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వు జారీ చేసిన శ్రీశైలం హెడ్‌వర్క్స్, అవుట్‌లెట్లను తొలిరోజు పరిశీలిస్తారు. సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, వాహనాలు ఇలా అన్నింటినీ చూస్తారు. రెండో రోజు ప్రాజెక్టుల అప్పగింతపై ఉపసంఘం చర్చిస్తుంది’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గోదావరి బోర్డు ఉపసంఘంలోని సభ్యులు రెండుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రాజెక్టులను వేర్వేరుగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది.