KRMB committee Meet: జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన సహా వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణా కమిటీ సమావేశంలో రూల్ కర్వ్స్ విషయమై చర్చించారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు.
అందుకు అనుగుణంగానే ఇవాళ కమిటీ మరోమారు భేటీ కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా కమిటీ సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న కమిటీలో బోర్డు సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు వెంకటరాజం, సృజయకుమార్ ఉన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం విధివిధానాలు, రూల్ కర్వ్స్, వరదజలాల లెక్కింపు అంశాలపై కమిటీ చర్చించనుంది.