తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB and GRMB Gazette issue: కేంద్రం వద్దకు కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ప్రాజెక్టుల పంచాయితీ.. - బోర్డులకు ప్రాజెక్టులు అప్పగించని రాష్ట్రాలు

నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టుల వ్యవహారం కేంద్రం వద్దకు చేరనుంది (KRMB and GRMB Gazette issue). ఈనెల 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమలై బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు రావాల్సి ఉన్నప్పటికీ అది ఇంకా జరగలేదు. కృష్ణాకు సంబంధించి తమ పరిధిలోని ఔట్​లెట్లను అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై రెండు బోర్డులు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నాయి.

KRMB and GRMB Gazette issue
KRMB and GRMB Gazette issue

By

Published : Oct 16, 2021, 4:30 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నదీ యాజమాన్య బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది (KRMB and GRMB Gazette issue). జులైలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రెండు బోర్డులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. బోర్డుల సమావేశాలు, సమన్వయ సంఘాలు, ఉపసంఘాల సమావేశాలు నిర్వహించింది. అన్ని ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి అవసరం లేదని, గెజిట్ లో మార్పులు చేయాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జలశక్తి శాఖను కోరాయి. రెండో షెడ్యూల్​లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ కొన్నింటిని ప్రాధాన్యక్రమంలో ఆధీనంలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన బోర్డుల ప్రత్యేక సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రాలు అప్పగిస్తేనే కదా..

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నేరుగా నీటిని తీసుకునే ఔట్​లెట్లన్నింటినీ స్వాధీనం చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు తీర్మానించింది. అందులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 15 ఔట్​లెట్లు ఉన్నాయి. పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకునేందుకు గోదావరి బోర్డు నిర్ణయించింది (KRMB and GRMB Gazette issue). రెండు రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయి. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బోర్డులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులు, ఔట్​లెట్లు, వాటికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది. బోర్డులు తమంతకు తాముగా వాటిని ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగిస్తేనే వాటిని బోర్డులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

ఎటూ తేల్చని తెలంగాణ... షరతులు పెట్టిన ఏపీ

కృష్ణా బోర్డు సమావేశం తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిధిలోని ఆరు ఔట్ లెట్లను అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల అమలుకు షరతులు విధించింది. తెలంగాణ పరిధిలోని ఔట్​లెట్లను అప్పగించినపుడే ఏపీ ఔట్​లెట్లను కూడా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో జూరాల ప్రాజెక్టును కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉత్తర్వులోనే ఆ అంశాన్ని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు (KRMB and GRMB Gazette issue). జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇచ్చేందుకు తెలంగాణ సముఖంగా లేదు. ఇదే విషయాన్ని బోర్డుల సమావేశాల్లో స్పష్టం చేసింది. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మినహా మిగతా ఔట్ లెట్లను అప్పగించే అంశాన్ని పరిశీలించవచ్చని నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మినహాయించి మిగతా ఔట్ లెట్లను అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

అలా అయితే ఎలా..

అయితే ఏపీ మాత్రం జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకపోతే గెజిట్ నోటిఫికేషన్​లో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. దిగువన సాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడంతోనే సమస్య తలెత్తిందని... కేంద్రం నుంచి గెజిట్ వచ్చేందుకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణ బోర్డుకు స్వాధీనం చేయకపోతే ఫలితం ఉండదని అంటున్నారు. గోదావరికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఈ పరిస్థితుల్లో బోర్డులు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది (KRMB and GRMB Gazette issue).

తదుపరి కార్యాచరణ ఏమిటంటే..

జరుగుతున్న పరిణామాలను కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సిద్ధమవుతున్నాయి. సమావేశాల మినిట్స్​తో పాటు రెండు రాష్ట్రాల ఉత్తర్వులు, స్పందనలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం (KRMB and GRMB Gazette issue). జలశక్తి శాఖ ఆదేశాల ప్రకారం బోర్డులు తదుపరి ముందుకెళ్లనున్నాయి.

ఇదీ చూడండి:KRMB and GRMB Gazette: అవి తప్ప మిగతావి అప్పగిస్తామంటున్న తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details