తెలంగాణ

telangana

ETV Bharat / state

Water boards: నేటి నుంచే కీలక సమావేశాలు.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకే మొగ్గు - కేఆర్ఎంబీ

ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నేటి నుంచి కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. ఉపసంఘాలతో ప్రారంభించి పూర్తి స్థాయి బోర్డుల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఆర్టీఎస్​తో పాటు పెద్దవాగు ప్రాజెక్టులు 14వ తేదీ నుంచి బోర్డుల నిర్వహణలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

krmb and grmb boards
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు

By

Published : Oct 10, 2021, 4:15 AM IST

కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు త్వరలోనే నదీ యాజమాన్య బోర్డుల చేతిలోకి వెళ్లనున్నాయి. రెండు బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి అది అమల్లోకి రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం, వివరాల ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టేందుకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సిద్దమవుతున్నాయి. శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌, ముచ్చుమర్రి, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ఔట్ లెట్లు, నాగార్జున సాగర్ ఎడమ, కుడి కాల్వలు, ఆర్డీఎస్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేపట్టే అవకాశం ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు బోర్డు నిర్వహణలోకి వెళ్లనుంది.

ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రెండు బోర్డుల ఉపసంఘాలు ఇవాళ హైదరాబాద్ జలసౌధలో సమావేశం కానున్నాయి. పూర్తి స్థాయి గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశం రేపు, కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ విషయమై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రాల నుంచి ఇంకా రావాల్సిన సమాచారం, వివరాలపై కూడా ఆరా తీస్తారు. నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలు రెండు బోర్డులకు 200 కోట్ల రూపాయాలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఈ విషయమై కూడా చర్చ జరగనుంది. కొంత మొత్తాన్ని బోర్డులకు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇదీ చూడండి:KRMB and GRMB: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణకు సిద్ధమవుతున్న బోర్డులు

ABOUT THE AUTHOR

...view details