Zero TMC in Alamatti Reservoir : రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన కృష్ణా బేసిన్ దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనబోతుందా అని నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నీటి ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే.. 2015-16 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాకాల సీజన్ ప్రారంభమై 40 రోజులైనా.. ఇప్పటివరకు ఎగువ కృష్ణానదిపై ఉన్న ఆలమట్టిలోకి చుక్క నీరూ రాలేదు. ఇలాంటి పరిస్థితి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఎప్పుడూ ఎదురు కాలేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
Water Level in Alamatti Reservoir : 2014-15 సంవత్సరంలో జులై మొదటి పక్షం వరకు ఆలమట్టిలోకి కేవలం 0.23 టీఎంసీల నీరుమాత్రమే వచ్చింది. తర్వాత 15 రోజుల్లో 120 టీఎంసీలు రావడంతో కాస్త ఆలస్యమైనా ఆగస్టు నెల మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేశారు. ఆలమట్టి నిర్మాణం తర్వాత తక్కువ ప్రవాహాలు ఉన్నప్పుడు జులై ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే జులై మొదటి పక్షం వరకు ఎంత తక్కువ అనుకున్నా.. దాదాపు 25 నుంచి 30 టీఎంసీల నీరు వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు ఆ పరిస్థితి కనబడటం లేదు.
గడ్డు పరిస్థితేనా..?కృష్ణా బేసిన్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైనది. నాగార్జునసాగర్, శ్రీశైలంతో పాటు ఇటీవల సంవత్సరాల్లో రాష్ట్రంలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి.. ఏపీలోని గాలేరు-నగరి, తెలుగు గంగ, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలంల మీద ఆధారపడి నీటిని తీసుకొంటున్నాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తే.. ఇందులో 450 టీఎంసీలు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి రావాలి. ప్రత్యేకించి తుంగభద్ర నుంచి కొంత, ఆలమట్టి నుంచి ఎక్కువగా రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం.. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీటి జాడ కనిపించకపోవడం, అసలు ప్రవాహం లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు దశాబ్దాల్లో నాలుగోసారి..:కృష్ణా బేసిన్‌లో 2002-03 సంవత్సరం, 2003-04 సంవత్సరంలో, ఆ తర్వాత 2015-16లోనూ తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జులై నెల మొదటి పక్షం వరకు ఏ రిజర్వాయర్‌లోకీ ప్రవాహం రాలేదు. కానీ.. ఈ సంవత్సరం పరిస్థితులు అప్పటి కంటే దయనీయంగా ఉన్నాయి. కృష్ణా నది కర్ణాటక దాటిన తర్వాత మొదటగా రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు ఉన్నా.. దీని సామర్థ్యం తక్కువ. దీంతో దీనికి దిగువన ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. ప్రస్తుతం 215 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టు అటు జల విద్యుత్, ఇటు సాగు నీటి అవసరాలు తీర్చడంతో పాటు, దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహం ఉండాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదల చేయాల్సిందే.