KRMB Meeting: 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు.
తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్‌పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా సమావేశం కొనసాగుతోంది. ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బోర్డు భేటీలో సభ్యకార్యదర్శి రాయిపురే, సభ్యులు మౌంతాంగ్, ఆర్కే పిళ్లై, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇంజినీర్లు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదు:శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. దురదృష్టవశాత్తు కొత్త రాష్ట్రమైన తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తి ఒక్క ఏడాదికే అని గత సంవత్సరం అంగీకరించామన్న ఆయన... కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెరిసగం వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని నమోదు చేయాలని బోర్డుకు ఇప్పటికే లేఖ కూడా రాసినట్లు ప్రకటించారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదే విద్యుత్ ఉత్పత్తి కోసమన్న రజత్‌కుమార్.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అభ్యంతరం తగదని ఆక్షేపించారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తలరిస్తున్నప్పటికీ... తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ్టి సమావేశంలో తెలంగాణ వాదనలు మరోమారు బలంగా వినిపిస్తామని ఆయన పేర్కొన్నారు.
"కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీకి చెరిసగం వాటా ఇవ్వాలి. 66:34 నిష్పత్తికి మేం అంగీకరించడం లేదు. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలు మించి తీసుకోరాదు. ఈ విషయాన్ని నమోదు చేయాలని బోర్డుకు ఇప్పటికే లేఖ కూడా రాశాను. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఏపీకి అభ్యంతరం తగదు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారు.తెలంగాణకు అదనంగా రావాల్సిన నీళ్లు ఇవ్వడం లేదు." -రజత్‌కుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
విద్యుదుత్పత్తికి నీటి విడుదలపై..
2021-22 నీటి సంవత్సరంలో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై ప్రత్యేకించి విద్యుదుత్పత్తి చేసేందుకు విడుదలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. పోటీపడి విద్యుదుత్పత్తి చేశారని.. తమ ఆదేశాలను ఉల్లంఘించారని ఎజెండాలో బోర్డు పేర్కొంది. తెలంగాణ 218 టీఎంసీల నీటిని వినియోగించుకొని 281 రోజుల్లో 1217 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీలతో 183 రోజుల్లో 1146 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. శ్రీశైలంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేనప్పుడూ విద్యుదుత్పత్తి చేశారని, మొత్తం 501 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళ్లాయని.. ఇందులో ఎక్కువ నీటిని ఆదా చేయడానికి అవకాశం ఉండిందని బోర్డు పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.800 కోట్లు, నాగార్జునసాగర్, పులిచింతలకు మరో రూ.30 కోట్లు అవసరమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చింది. తెలంగాణకు ఆర్డీఎస్‌లో 15.9 టీఎంసీల కేటాయింపు ఉండగా, చాలా కాలంగా ఈ మేరకు రావడం లేదు. దీన్ని ఎజెండాలో చేర్చి కర్ణాటక, తుంగభద్ర బోర్డు ప్రతినిధులను కూడా ఆహ్వానించింది. గెజిట్ నోటిపికేషన్ ప్రకారం ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు.
ఇవీ చదవండి: