ప్రాజెక్టుల్లో నీటిమట్టాల ఆధారంగా వాటాల కేటాయింపు - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వార్తలు
11:37 February 05
ప్రాజెక్టుల్లో నీటిమట్టాల ఆధారంగా వాటాల కేటాయింపు
హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ తరఫున నాగార్జునసాగర్ సీఈ నర్సింహ, ఏపీ నుంచి ఆ రాష్ట్ర ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటినిల్వల ఆధారంగా మార్చి ఆఖరు వరకు అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులపై చర్చించారు. 108 టీఎంసీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, 80 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ బోర్డుకు ఇప్పటికే ఇండెంట్ ఇచ్చాయి. అయితే శ్రీశైలంలో 810, సాగర్ 520 అడుగుల దిగువకు నీరు తీసుకోరాదని తెలంగాణ తెలిపింది. దీంతో ఏపీ ఇండెంట్‌ను 95 టీఎంసీలలోపు ఇవ్వాలని సూచించారు. ఏపీ ఇండెంట్ వచ్చాక రెండు జలాశయాల్లో నీటిమట్టాల ఆధారంగా నీటివిడుదల ఉత్తర్వులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు జారీ చేయనుంది.
అటు సాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలు, మిగిలిన నీటిని మరుసటి ఏడాదికి క్యారీ ఓవర్ చేయడం, వరద సమయంలో వినియోగించుకున్న నీటిని లెక్కించరాదన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. మిగిలిన నీటిని మరుసటి ఏడాదికి క్యారీ ఓవర్ చేసే అంశాన్ని ట్రైబ్యునల్‌కే వదిలిపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయం విశాఖకు తరలింపు ఖాయమని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. విశాఖ కృష్ణా బేసిన్ పరిధిలో లేదన్న అభ్యంతరాలను తోసిపుచ్చిన ఆయన గోదావరి బోర్డు కార్యాలయం ఉన్న హైదరాబాద్ కృష్ణా బేసిన్‌లోనే ఉందని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:పవర్ ప్లాంట్ ప్రమాదంలో కూలీ మృతి.. బాధిత కుటుంబం ఆందోళన