KRMB meeting: బోర్డు అడిగిన సమాచారం, వివరాలను రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిందే..! - తెలంగాణ వార్తలు
14:17 October 10
బోర్డు అడిగిన సమాచారం, వివరాలను రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిందే..!
ఉమ్మడి ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయమై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కసరత్తు వేగవంతం చేశాయి. అందులో భాగంగా రెండు బోర్డుల ఉపసంఘాలు హైదరాబాద్ జలసౌధలో విడివిడిగా సమావేశమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అధికారులు సమావేశాల్లో పాల్గొన్నారు. కేఆర్ఎంబీ(KRMB) సభ్యులు ఆర్‌కే పిళ్లై నేతృత్వంలో కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశమైంది. బోర్డు అడిగిన పూర్తి సమాచారం, వివరాలను రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిందేనని పిళ్లై స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు ఆధీనంలోకి తీసుకోవడంపై చర్చించినట్లు తెలిసింది.
జీఆర్‌ఎంబీ సమావేశం..
జీఆర్ఎంబీ(GRMB) సభ్యకార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన గోదావరి బోర్డు ఉపసంఘం సమావేశంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ విషయమై చర్చించారు. ఆయకట్టు ప్రకారం నిర్వహణ వ్యయాన్ని భరించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఇతర ప్రాజెక్టుల అంశాన్ని పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో చర్చించాలని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.