తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి - శ్రీశైలం ప్రాజెక్టు

కృష్ణా నదీ యాజమాన్య మండలి త్వరలో పూర్తిస్థాయిలో క్రియాశీలకం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ, వాటి కాలువలు, రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలన్నీ బోర్డు ఆధిపత్యంలోకి రానున్నాయి. మిగిలిన ప్రాజెక్టుల వద్ద కూడా బోర్డుకు సంబంధించిన సిబ్బంది ఉండి పర్యవేక్షిస్తారు.. జల విద్యుత్తు కేంద్రాల ద్వారా నీటి విడుదల కూడా బోర్డు పరిధిలోనే ఉంటుంది. ఈ మేరకు పరిధికి సంబంధించిన ముసాయిదాను కృష్ణా బోర్డు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపింది.

krishna river board decision is final!
క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి

By

Published : Oct 8, 2020, 5:36 AM IST

త్వరలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ, వాటి కాలువలు, రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలన్నీ కృష్ణా బోర్డు ఆధిపత్యంలోకి రానున్నాయి. జల విద్యుత్తు కేంద్రాల ద్వారా నీటి విడుదల కూడా బోర్డు పరిధిలోనే ఉంటుంది. ఈ మేరకు పరిధికి సంబంధించిన ముసాయిదాను కృష్ణా బోర్డు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపింది. కేంద్రం నోటిఫై చేసిన వెంటనే ఈ రెండు ప్రాజెక్టులు, వీటికి సంబంధించిన అన్ని ఔట్‌లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. మిగిలిన ప్రాజెక్టుల వద్ద కూడా బోర్డు ఇంజినీర్ల పర్యవేక్షణ ఉంటుంది. పలు దఫాలుగా చర్చించి, రాష్ట్రాల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాక వీటిని ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోదావరి బోర్డు పరిధి అంశం కూడా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గోదావరిలో రెండు రాష్ట్రాల వినియోగానికి సంబంధించి సంయుక్త ప్రాజెక్టులు లేవు. కృష్ణా బోర్డు పరిధికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ నీటి వాటాలపై తుది నిర్ణయం తీసుకునే వరకు రెండు రాష్ట్రాలకు బోర్డే వాటాలను నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు నీటిని తీసుకునేచోట్ల రోజూ వివరాల నమోదుకు సిబ్బందిని నియమిస్తారు. వీరితోపాటు కేంద్ర బలగాలను (సి.ఐ.ఎస్‌.ఎఫ్‌.) నియమించాలని ప్రతిపాదించారు. టెలిమెట్రీ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు.నీ శ్రీశైలం ప్రాజెక్టు, దీని నుంచి నీటిని తీసుకునే ఎత్తిపోతల పథకాలు హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల హెడ్‌రెగ్యులేటర్లు, నదికి నీటిని వదిలే స్లూయిస్‌లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు., ఎడమ కాలువ కింద రెండు రాష్ట్రాలకు నీటిని సరఫరా చేసే బ్రాంచి కాలువలు బోర్డు పరిధిలోకి వస్తాయి.
  • ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ప్రత్యేకించి జూరాల, సుంకేశుల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిర్వహణ, యాజమాన్యం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రతి సీజన్‌లోనూ ప్రాజెక్టులవారీగా ఎంత నీరు అవసరమో జలవనరుల శాఖలు అంచనా వేసి బోర్డుకు పంపితే, నీటి లభ్యతను బట్టి కేటాయింపు, విడుదల వంటి అంశాలపై బోర్డు సభ్యకార్యదర్శి, ఇద్దరు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-85 ప్రకారం బోర్డు పరిధిలో రెండు ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలు, ప్రవాహాల పర్యవేక్షణ, నీటి విడుదల సమయంలో అత్యవసర మరమ్మతులు చేపట్టడంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టుల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి నీటి విడుదలపై కూడా బోర్డుదే నిర్ణయం. ఈ మేరకు ముసాయిదాలో చేర్చారు.
  • ప్రాజెక్టుల నిర్వహణకు, బోర్డులో అదనపు సిబ్బంది కలిపి 328 మంది అవసరమని కేంద్రానికి ప్రతిపాదించారు. బోర్డుల పరిధి నిర్ణయించి పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభిస్తే రెండు రాష్ట్రాలపై ఆర్థికంగా కూడా అదనపు భారం పడుతుంది.

బోర్డు, రెండు రాష్ట్రాలకు చెందిన ఎస్‌.ఇ.లతో కూడిన కమిటీ 15 రోజులకోసారి ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకున్నారో, తక్కువ వాడుకున్నారో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. రిజర్వాయర్లలో నిల్వలు, కేటాయింపు, వినియోగానికి సంబంధించిన అంశాలపై సమీక్షకు బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ మూడు నెలలకోసారి సమావేశమవుతుంది.

ఇదీ చదవండి:లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

ABOUT THE AUTHOR

...view details