కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వచ్చే నెల ఒకటో తేదీన సంయుక్త సమావేశం నిర్వహించనున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డులు సమాచారం అందించాయి.
KRMB, GRMB MEETING: సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ - కేంద్ర గెజిట్‌పై సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ
16:52 August 26
సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు, నీటి పంపకాల అంశంపై చర్చించేందుకు కేఆర్ఎంబీ ఈ నెల ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ అంశాన్ని కూడా ఎజెండాలో పొందుపరిచారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించేందుకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు జీఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గెజిట్ కార్యాచరణపై వచ్చే నెల ఒకటో తేదీన సాయంత్రం 4 గంటలకు రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది.
భేటీకి హాజరుకావాలని సీఎం నిర్ణయం..
మరోవైపు వచ్చే నెల ఒకటో తేదీన జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. అందులో కృష్ణాజలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. కేఆర్‌ఎంబీ సమావేశం ఎజెండా అంశాలపై బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. 'కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా కోసం కృష్ణాబోర్డుతో పాటు ట్రైబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలి. 1న జరిగే సమావేశానికి సాధికారిక సమాచారంతో హాజరై, సమర్థవంతంగా మాట్లాడాలి' అని సీఎం సూచించారు.
ఇదీ చూడండి: 1న కేఆర్‌ఎంబీ భేటీకి తెలంగాణ హాజరు... అధికారులకు సీఎం దిశా నిర్దేశం