ప్రాజెక్టుల వారీ నీటిమట్టం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు మరోమారు స్పష్టం చేసింది. వివరాలు నమోదు చేయకపోతే నీటి వినియోగం, పంపిణీ నిష్పత్తి, తదితరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయని బోర్డు పేర్కొంది. ప్రత్యేకించి నీటి విడుదల ఉత్తర్వుల సమయంలో ఇబ్బంది ఎదురవుతోందని వివరించింది. 2019-20 నీటి సంవత్సరంలోనూ కొన్ని వివరాలు నమోదు చేయలేదని... ప్రస్తుతం కూడా కొన్ని చోట్ల వివరాలు నమోదు చేయడం లేదని తెలిపింది.
వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తేనే నీటి విడుదల ఉత్తర్వులు
రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీ నీటిమట్టం వివరాలు ఎప్పటికప్పుడు బోర్డు వెబ్సైట్లో నమోదు చేయాలని తెలిపింది. ప్రాజెక్టుల వివరాలు అన్నింటినీ వెబ్సైట్లో నమోదు చేస్తేనే నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేస్తామని లేఖలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలు కలిసే ప్రకాశం బ్యారేజ్ వద్ద, తెలుగుగంగ, తుంగభద్ర, గాజులదిన్నె, భైరవానితిప్ప, మునియేరు ప్రాజెక్టుల వద్ద వివరాలను చాలా రోజులుగా నమోదు చేయడం లేదని బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని ఆర్డీఎస్, డిండి, మూసీ, పాలేరు, ఊకచెట్టివాగు, కోటిపల్లివాగు ప్రాజెక్టుల వద్ద చాలా రోజులుగా వివరాలు నమోదు చేయడం లేదని పేర్కొంది.
ప్రాజెక్టుల వారీ వివరాలను ఎప్పటికప్పుడు బోర్డు వెబ్సైట్లో నమోదు చేయాలని తెలిపింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. ఇక నుంచి ప్రాజెక్టుల వివరాలు అన్నింటినీ బోర్డు వెబ్సైట్లో నమోదు చేస్తేనే నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేస్తామని లేఖలో స్పష్టం చేశారు.