శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజూ 4 టీఎంసీలతో విద్యుదుత్పత్తి చేస్తూ.. నీటిని దిగువకు వదిలేస్తోందంటూ కృష్ణా బోర్డుకు ఏపీ అధికారులు లేఖ రాశారు. దీనిపై బోర్డు స్పందించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. ఇంతవరకు 60 టీఎంసీలను తెలంగాణ.. జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలినట్లు ఆరోపించారు. శ్రీశైలంవద్ద నీటిమట్టం 853 అడుగులే ఉందని, అదే జల విద్యుత్తు ఉత్పత్తి చేయకుంటే ఇప్పటికే 870 అడుగులకు చేరి ఉండేదన్నది ఏపీ వాదన.
బోర్డుకు శ్రీశైలం ఎస్‌ఈ లేఖ
శ్రీశైలం ఎస్‌ఈ కూడా దీనిపై కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ‘1996లో ఇచ్చిన జీవో 69 ప్రకారం నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లో సాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. అయితే సాగర్‌వద్ద ఎలాంటి నీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ అధికారులు విద్యుత్తుత్పత్తి ప్రారంభించి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు అనుమతి తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకూ సమాచారం ఇవ్వలేదు’ అని ఆ లేఖలో ఎస్‌ఈ పేర్కొన్నారు.
అనుమతి లేకుండా నీళ్లు తీసుకోవద్దు
ఈ విషయంపై కృష్ణా బోర్డు కార్యదర్శి మీనా.. తెలంగాణ ఇంజినీరు ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటిశాఖ ఇంజినీరు ఇన్ చీఫ్ తమకు వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చారని, శ్రీశైలం ఎస్‌ఈ లేఖ రాశారని పేర్కొంటూ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలని సూచించారు. వెంటనే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుండా నీటిని తీసుకోవడానికి వీల్లేదని, విద్యుత్తు ఉత్పత్తి సాగు అవసరాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఆపండి
శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేయడాన్ని తక్షణం నిలిపివేయించాలని ఏపీ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు కార్యదర్శికి గురువారం మరో లేఖ రాశారు. విద్యుదుత్పత్తిని ఆపాలని జులై 20న కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చినా ఇప్పటికీ వారు కొనసాగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ‘ఉన్న ప్రవాహాలకు అదనంగా నీటిని విద్యుదుత్పత్తికి వాడటంతో పాటు ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారు. ఇప్పటివరకు శ్రీశైలంలోకి 64.98 టీఎంసీల నీళ్లొస్తే జలవిద్యుత్తుకే 38.37 టీఎంసీలు తీసుకున్నారు. తెలంగాణ జెన్‌కో వైఖరితో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీటిని అందించడమూ కష్టమవుతోంది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గకుండా చూడటంతో పాటు పోతిరెడ్డిపాడు జలాశయం ద్వారా తాగునీరు అందించేందుకు వీలు కల్పించాలి’ అని అభ్యర్థించారు.
ఇదీ చదవండి:'తీసుకున్న లంచం తిరిగిచ్చేస్తా': చింతలమానేపల్లి తహసీల్దార్