రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు నిర్ధిష్ట గడువులకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహకరించాలని నదీయాజమాన్య బోర్డులు తెలిపాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి అత్యవసర సమావేశానికి తెలంగాణ గైర్హాజరయ్యింది. గెజిట్ అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ఆంధ్రప్రదేశ్... కొన్ని సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపింది.
ఉమ్మడి అత్యవసర సమావేశం
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెలలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు కోసం సమావేశాన్ని నిర్వహించారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా సమావేశానికి హాజరు కావడం కుదరదని ముందే తెలిపిన తెలంగాణ ప్రభుత్వం భేటీకి గైర్హాజరైంది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఛైర్మన్లు చంద్రశేఖర్ అయ్యర్, ఎంపీసింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రెండు బోర్డుల సభ్యకార్యదర్శులు, సభ్యులు, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఒక్కో బోర్డుకు 200కోట్లు ఇవ్వాలి..
కేంద్ర జలశక్తిశాఖ ఇచ్చిన గడువులకు అనుగుణంగా ప్రాజెక్టులు, సిబ్బంది, నిర్వహణకు సంబంధించిన వివరాలు, ఒక్కో బోర్డుకు 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని బోర్డు ఛైర్మన్లు కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ఆంధ్రప్రదేశ్ అధికారులు... కొన్ని క్లాజులు, షెడ్యూళ్లలోని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు లేని ప్రాజెక్టుల వివరాలు ఇస్తామని, డబ్బుల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న బోర్డు ఛైర్మన్లు... ఈ లోపు అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వాలని కోరారు. నెల రోజుల గడువులోపు కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేనందున అదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని వారు అన్నట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాలు సహకరించాలి..
సమావేశంపై ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన రెండు బోర్డులు... అవసరమైన సమాచారాన్ని త్వరలో, అభ్యంతరాలు లేని ప్రాజెక్టుల వివరాలను నెలరోజుల్లోపు ఇచ్చేందుకు ఏపీ అంగీకరించిందని ప్రకటించాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత విషయమై కేంద్రహోంశాఖతో జలశక్తి శాఖ సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం రెండు రాష్ట్రాలు, శాఖలు నిర్ధిష్ట గడువుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సహకరించాలని బోర్డు ఛైర్మన్లు కోరారు.
ఇవీ చదవండి: