తెలంగాణ

telangana

ETV Bharat / state

జగనన్న లే-ఔట్​లో కనీస సౌకర్యాలు లేవు : వైకాపా ఎమ్మెల్యే - జిల్లాల అభివృద్ధిపై కాకాణి సమీక్ష

ఏపీ నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పలువురు శాసనసభ్యులు తమ నియోజవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. తన నియోజవర్గంలో సమస్యలు పరిష్కరించటం లేదంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జగనన్న లే-ఔట్​లో కనీస సౌకర్యాలు లేవు'
'జగనన్న లే-ఔట్​లో కనీస సౌకర్యాలు లేవు'

By

Published : Jul 6, 2022, 8:11 PM IST

జగనన్న లే-ఔట్​లో కనీస సౌకర్యాలు లేవు : వైకాపా ఎమ్మెల్యే

"జగనన్న లేఅవుట్​​లో కనీస సౌకర్యాలు లేవు. పది నెలలుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా.. పరిష్కరించటం లేదు. నియోజకవర్గం పరిధిలోని డివిజన్​లలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి." ఈ వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్షాలు కాదు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి! నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు శాసనసభ్యులు తమతమ నియోజవర్గాల్లోని సమస్యలపై గళమెత్తారు.

నెల్లూరు రూరల్ మండలంలోని వావిలేటపాడు జగనన్న లేఅవుట్​​లో కనీస సౌకర్యాలు లేవని ఎమ్మెల్యే కోట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పది నెలలుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా.. పరిష్కరించటం లేదని వాపోయారు. రూరల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్​లలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వీటి మరమ్మతులకు రూ. 100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిలిచిపోయిన బీసీ భవన్, అంబేడ్కర్ భవన్​ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు.

చేసిన పనులకు బిల్లులు సక్రమంగా చెల్లించకపోవటంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటంలేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. అధికారులు చొరవ తీసుకొని అభివృద్ధి పనులు త్వరతిగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాకు అధికారులు ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో తెలియటం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఆర్​అండ్​బీ రోడ్ల పనులు చేపట్టామని, అలాగే పంచాయతీ రోడ్ల పనులను త్వరలోనే చేపడతామని మంత్రి కాకాణి వెల్లడించారు. నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. మందకొడిగా సాగుతున్న సచివాలయాలు, ఆర్బీకే భవన నిర్మాణ పనులను వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడతామన్నారు.

ఇవీ చదవండి:ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు


ABOUT THE AUTHOR

...view details