Koonanni reaction to CBI investigation on Kavitha: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణపై వామపక్ష నాయకులు స్పందిస్తున్నారు. కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ బహిరంగంగా జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని మీడియా ఎదుట కవితను విచారించాలని పేర్కొన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో దాడులు చేసి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోందని కూనంనేని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక టీఆర్ఎస్ నాయకుడిపై ఐటీ దాడులు చేయిస్తూ తద్వారా బీజేపీలోకి చేర్చుకునే కుట్ర చేస్తోందని కేంద్రంపై ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. దిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ పతనం ప్రారంభమైందని కూనంనేని జోస్యం చేశారు.