KondalRao Who is Excelling As a Young Writer: తన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని.. కదిలించే సన్నివేశాల్ని.. కవితలుగా రాస్తూ నేటి తరంలో మేటి రచయితగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగి.. అనూహ్య పరిస్థితుల్లో ఇటువైపు మళ్లాడు. చదివింది హిస్టరీ అయినా తెలుగు భాషపై మంచి పట్టు, సాహిత్యంపై మక్కువతో భాషాభిమాని అనిపించుకున్నాడు. ఇప్పటికే 3 పుస్తకాలు రాసి పలువురి ప్రశంసలు అందుకుంటూ.. సినిమా రచయితగానూ అరంగేట్రం చేసి బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నాడు ఆ పాతికేళ్ల యువకుడు.
కలంతో కుస్తీ పడుతున్న ఈ యువకుడి పేరు అడ్డగళ్ల కొండల్రావు. తూర్పుగోదావరి జిల్లా వాడపాలె స్వస్థలం. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కూరగాయల వ్యాపారం చేసేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.కాం డిగ్రీ చదివిన యువకుడు.. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో పీజీ పూర్తి చేశాడు. సమాజంలో జరిగే సంఘటలు, వాటి వెనక విషయాలను పరిశీలించి.. రచయితగా మారినట్లు చెబుతాడు.
"వాస్తవికం" పేరుతో తొలి వచనా కవిత్వం విడుదల:చిన్ననాటి నుంచి తెలుగుభాషపై మక్కువ కలిగిన యువకుడు.. చదువుకుంటూనే సరదాగా కవితలు రాయడం మొదలుపెట్టాడు.. వాటిని స్నేహితులు, సన్నిహితులకు వినిపించగా.. వారంతా కొండల్రావు ప్రతిభను అభినందించారు. దాంతో నూతనొత్తేజం పొంది.. పూర్తిస్థాయిలో రచనలవైపు దృష్టి సారించాడు. సాహిత్యంపై కాస్త పట్టున్న కొండల్రావు.. సునాయసంగా కవితలు అల్లేవాడు. ఈ క్రమంలోనే "వాస్తవికం" పేరుతో తన తొలి వచనా కవిత్వం సంపుటిని విడుదల చేశాడు.
వాస్తవికం రచనకు మిత్రులు, పలువురు సాహితీవేత్తల నుంచి అందిన ప్రోత్సాహంతో కొద్ది రోజుల్లోనే "చురకలు" పేరుతో మరో పుస్తకాన్ని రాశాడు కొండల్రావు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, నవలా రచయిత యండమూరి ఆ పుస్తకానికి ముందుమాటలు రాసి కొండల్రావు భుజం తట్టారు. సమాజంలో జరిగే సంఘటలుగా కవితలు రాసే. యువకుడు.. చురకలు పుస్తకంలోని ఓ కవితను ఈ విధంగా చెబుతాడు.