సమాజంలో 50 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా అశోక్ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ లక్ష్మణ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెదేపా అధ్యక్షుడు రమణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, మాజీ ఎంపీ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎల్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్: మాజీమంత్రి నాయిని
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్యలను భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సన్మానించారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి 105వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కొండా లక్ష్మణ్ ఉద్యమాలు చిరస్మరణీయమని, నాడు తెలంగాణ ఉద్యమానికి తన ఇల్లు ఇచ్చిన ఘనత ఆయనదని లక్ష్మణ్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అభివర్ణించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిన నాడే సమాజం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వాన్నీ త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం నెరవేరినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ క్యాబినెట్లో బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించకపోవడం విచారకరమని తెదేపా అధ్యక్షుడు రాష్ట్ర ఎల్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. నీతికి, నిబద్ధతకు, నిజాయితీకి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
ఇదీ చూడండి:లక్ష్మణ్ బాపూజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం: బండి