Komatireddy Venkat reddy: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని...సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో రాఘవేందర్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కుమారుడి వేధింపులను వివరిస్తూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాఘవ ఎక్కడున్నాడో గుర్తించలేరా అని కోమటిరెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి ఉన్నా లేనట్టేనని.. ఆరోపించిన భువనగిరి ఎంపీనా, సొంత పార్టీనా అని చూడకుండా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.
రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా చాలా గ్రామాలు ప్రభావితమవుతన్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా నాశనమవుతుందని తెలిపారు. బోర్ల నుంచి రసాయనాలతో కూడిన నీరు వస్తుండడంతో బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపీ వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.