Komatireddy RajagopalReddy Tweet: మంత్రి కేటీఆర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. కేటీఆర్‌కు ఏ మాత్రం విశ్వసనీయత, నిజాయితీ ఉన్నా.. తాను బీజేపీలో చేరినందుకు రూ.18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని నిరూపించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో గ్లోబల్స్ ప్రచారం పని చేస్తుందని అనుకోవద్దని ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు హితవు పలికారు.
అయితే గురువారం జరిగిన మీడియా సమావేశంలో మునుగోడులో ఒక వ్యక్తికి ఏకంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టును బీజేపీ మూటజెప్పిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. ఇన్ని వేలకోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు.. బీజేపీలో చేరగానే వారు సత్యవంతులైపోతారని అన్నారు. వారి మీద ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులు ఉండవని చెప్పారు. వారిలో సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లు ఆ పార్టీలో చేరగానే వారిపై ఉన్న కేసులు అన్నీ మాయమైపోయాయి ఏంటో ఆ విడ్డూరం తెలియడం లేదని ఆశ్చర్యపోయారు.
'బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థ బీజేపీ మాట వినలేదని.. ఆ సంస్థపై దాడులకు ఊసిగొల్పింది. ఈ 9 సంవత్సరాల్లో బీజేపీ 9 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను నేలకూల్చింది. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5422 ఈడీ కేసులు నమోదయ్యాయి. కచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని' కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.