హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుంది. పనిచేసే వారి ఇంట్లో ఇంత ఉప్పు తింటున్నామని ఎంతో విశ్వాసంగా ఏళ్ల తరబడి పనిచేసే పనివాళ్లను చూశాం కానీ.. నమ్మినందుకు ప్రతిఫలంగా మత్తుమందు పెట్టి విలువైన వస్తువులను దొంగతనం చేసి ఉడాయించిన పనివారిని కోకాపేటలో ఆరిస్టోస్ పౌలోమీ విల్లాలో జరిగిన చోరీని చూస్తే అర్థమవుతుంది.
నమ్మించి.. దొంగతనం చేశారు...
కోకాపేటలోని 44వ నెం విల్లాలో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన నేపాలీ జంటను పనిమనుషులుగా కుదుర్చుకున్నారు. పనిలో చేరిన వారం రోజుల్లోనే పవిత్ర అనే పని అమ్మాయి ఇంట్లో మనిషిలా కలివిడిగా అందరితో కలిసిపోయింది. యజమానుల వ్యక్తిత్వంతో పాటు ఇంట్లో ఏ వస్తువులను ఎక్కడ దాచారో అన్ని క్షుణ్ణంగా గమనించింది. ఇంక అన్నీ బాగానే ఉన్నాయనుకుని.. ఇంట్లో వ్యక్తులకు ఎటువంటి అనుమానం రాకుండా ఎంతో నమ్మకాన్ని కూడగట్టుకుంది.
ఈ నెల 3వ తేదీ రాత్రి మత్తుమందు కలిపిన భోజనాన్ని యజమాని కుటుంబంలోని వారికి పెట్టింది. వారు మత్తులో జారుకుందే తడవుగా ఆ పనిమనుషుల జంట బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, విలువైన దుస్తులను 4 బ్యాగుల్లో సర్దుకుని అక్కడి నుంచి పారిపోయారు.
మరో కూతురు ఫోన్‌తో వెలుగులోకి వచ్చిన దొంగతనం
తెల్లారి గచ్చిబౌలీలో ఉండే వ్యాపారి మరో కూతురు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆమె విల్లాకు వచ్చి చూసే సరికి ఎక్కడివారు అక్కడ స్పృహలేకుండా పడిపోయి ఉండడం గమనించి చుట్టు పక్కల వారి సహాయంతో ఆస్పత్రికి తరలించింది.