Kodi Pandelu 2022: ఏపీలో సంక్రాంతి రెండో రోజునా పందెం కోళ్లు.. జూలు విదిల్చి కాలు దువ్వాయి. బరిలోకి దూకి చావో రేవో తేల్చుకున్నాయి. పందెం రాయుళ్లకు కాసులు కురిపించాయి. కోడిపందేలకు పేరుగాంచిన ఉభయగోదావరి జిల్లాల్లో పండగ వాతావరణం ఉట్టిపడింది. కోడిపందేల నిర్వహణ కోసం పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో పెద్దబరులు ఏర్పాటు చేయగా మెట్టప్రాంతంలో ఓ మోస్తరు బరులు ఏర్పాటు చేశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో కోట్ల రూపాయలు పందేలు కాశారు.
తూర్పుగోదావరి జిల్లా పల్లంకుర్రు, కొత్తపేట, రాజానగరం నియోజకవర్గాల్లో భారీ మొత్తాల్లో పందేలు సాగాయి. ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, కాకినాడ, నియోజకవర్గాల్లోనూ కోడి పందేలు పెద్ధ ఎత్తున సాగాయి. పెద్ద బరిలో లక్ష నుంచి 20 లక్షల రూపాయల వరకు పందేలు జరగ్గా.. మోస్తరు బరుల్లో 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగులు కాశారు. మొత్తంగా రెండు వందల కోట్ల రూపాయల వరకు పందేల లావాదేవీలు సాగినట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లోనూ ఫ్లడ్‌లైట్లు వెలిగించి మరీ కోడిపందేలు నిర్వహించారు. భారీగా శిబిరాలు, వేదికలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద భారీగా గుండాట, పేకాట జోరుగా సాగాయి.
కృష్ణా జిల్లాలోనూ..
కృష్ణాజిల్లా వ్యాప్తంగానూ జోరుగా కోడిపందేలు జోరుగా సాగాయి. రాత్రి సమయంలోనూ ఆడేందుకు ప్రత్యేకంగా లైట్లు, శిబిరాలను ఏర్పాటు చేశారు. కోడి పందెల దగ్గరే మరో వైపు జూదం ఆటలు నడిచాయి. పందెం రాయుళ్ల మధ్య గొడవలు జరగకుండా.. పందేలను ప్రత్యేకంగా కెమెరాల్లో చిత్రీకరించారు. కోడిపందెలు వీక్షించేలా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కంకిపాడు, ఈడ్పుగల్లు, గన్నవరం సమీపంలోని అంపాపురంలో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పెదప్రోలు, చల్లపల్లి, ఎడ్లలంక, వక్కపట్లవారిపాలెం, సోర్లగొంది, కొడాలి, పాపవినాశనం ఎదురుమొండి దీవుల్లో జోరుగా కోడిపందేలు, పేకాట, గుండాట జరిగాయి. రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో.. పేకాట శిబిరాలకు అన్ని హంగులూ ఏర్పాటుచేశారు. బరులు ఏర్పాటు చేసిన చోట వేల సంఖ్యలో పందెం రాయుళ్లు.. వాహనాలతో రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. పందేలు చూడటానికి యువకులు కొందరు గోడలు దూకి మరి బరుల్లోకి వెళ్లారు.