కోడెల శివప్రసాదరావు....రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలకనేత..! మనిషి బక్కపలుచగా ఉన్నా గుండె ధైర్యం మెండుగా ఉన్న నాయకుడు. పల్నాడులోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు ఎదురు నిలిచిన తిరుగులేని నేత...! సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రప్రథమ సభాపతి స్థానాన్ని అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు చేపట్టిన ఆయన... అనూహ్య పరిస్థితిల్లో లోకాన్ని వీడారు. చివరి రోజుల్లో రాజకీయ ఒత్తిడి, కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలు తనపై నమోదైన కేసులతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యారు. అనూహ్యంగా సోమవారం చనిపోయారు. రాజకీయ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డారనే కుటుంబసభ్యులు చెబుతున్నారు.
వైద్యుడిగా వచ్చి.. నాయకుడిగా ఎదిగి..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో 1947 మే 2న కోడెల జన్మించారు. ప్రాథమిక విద్య సొంతఊరిలో పూర్తి చేసిన కోడెల.. విజయవాడ లయోలాలో పీయూసీ చదివారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. వారణాసిలో పీజీ చేసిన కోడెల...నరసరావుపేటలో ఆస్పత్రిని ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందించారు. పల్నాడు ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది నరసరావుపేటలోని కోటే. ఆయన హస్తవాసి గొప్పదని పేరు రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కోడెలకు మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గుంటూరు జిల్లాలో తిరుగులేని నేతగా నిలిచారు. రెండు సార్లు అపజయం ఎదురవడం వల్ల 2014లో సత్తెనపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
పల్నాటి ఫైర్‌బ్రాండ్
చూడటానికి బక్కపలుచగా.. మాటల్లో మృదువుగా కనిపించే కోడెల.. రాజకీయాల్లో మాత్రం పల్నాటి పౌరుషం చూపించారు. పల్నాడులోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులను, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. యువనేతగా పల్నాటి పౌరుషాన్ని చూపిన ఆయన వయసు పెరిగే కొద్దీ పెద్దరికాన్ని నిలుపుకున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. రాష్ట్రంలో కీలకనేతగా ఎదిగారు. యువనేతగా ఉన్న కాలంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంటి కీలకపదవులు చేపట్టారు. చంద్రబాబు హయాంలో పంచాయతీరాజ్, భారీ నీటి పారుదల, ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేశారు. కోడెల మొదటి నుంచి దూకుడైన నేతగానూ పేరొందారు. ఆ దూకుడే ఆయన్ను కార్యకర్తలకు కూడా దగ్గర చేసింది. సీనియర్ నేతగా మారాక కాస్త తగ్గినప్పటికీ అవసరం వచ్చినప్పుడు ఎందాకైనా వెళ్తారన్న దానికి మొన్నటి ఎన్నికలే తాజా ఉదాహరణ. మొన్నటి ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్‌లో తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని తెలిసి.. కోడెల స్వయంగా అక్కడికి వెళ్లిపోయారు. ఆయనపై దాడి కూడా జరిగింది.
నవ్యాంధ్ర తొలి సభాపతి
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభకు ఆయన సభాపతిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అమరావతిలో మహిళా పార్లమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.