తెలంగాణ జనసమితి(తెజస) కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పోడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని.. పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో ఏడాది పాటు పనులు చేయించుకొన్న నర్సులను ఇప్పటికిప్పుడు తొలగించడం దారణమన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.