ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీని కలిసినట్లు వస్తున్న ప్రచారాలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టతనిచ్చారు. తాను 6 నెలల క్రితం కలిసింది నిజమేనని చెప్పారు. కానీ అందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే ఆయనను కలిశానని వెల్లడించారు. రాజకీయ జీవితంలో అనేక మందిని కలుస్తుంటామని పేర్కొన్నారు.
సింహయాజీని తిరుపతికి చెందిన స్వామిజీగా తనకు పరిచయం చేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక గురువు సింహయాజీని కలిశానని తెలియజేశారు. సింహయాజీకి రాజకీయాలతో సంబంధమున్నట్లు ఇప్పుడే తెలుస్తోందన్నారు. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
"నేను సింహయాజీని కలిసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 6 నెలల క్రితం సింహయాజీని కలిసిన మాట వాస్తవం.తిరుపతికి చెందిన స్వామీజీగా సింహయాజీని పరిచయం చేశారు. రెండు మూడు రోజులు తరువాత ఆయనను కలిశాను.తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువంటే కలిశాను. ఆధ్యాత్మిక గురువంటే కలిశాను తప్ప వేరే కోణం లేదు. సింహయాజీకి రాజకీయాలతో సంబంధమున్నట్లు ఇప్పుడే తెలుస్తోంది. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. - కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు