Kodandaram Fires on Telangana Government : రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తున్నట్లు.. ఆ సంఘాల నాయకులు ప్రకటించడం కొంత విస్మయాన్ని కలిగించేదిగా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు చర్చలు జరిపితే.. చర్చల సారాంశాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు. లేకపోతే లిఖితపూర్వకమైన ప్రకటననైనా జారీ చేస్తుందని.. కానీ ఇదేదీ ఇందులో జరగలేదని కోదండరాం పేర్కొన్నారు.
జేపీఎస్‌ల పట్ల ఆది నుంచి నిరంకుశంగా వ్యవహరిస్తోన్న ప్రభుత్వం : ప్రభుత్వం బెదిరించే ఈ సమ్మెను విరమింపజేశారనే అనుమానం కలుగుతుందని కోదండరాం ఆరోపించారు. నిజంగా సమ్మె న్యాయ సమ్మతంగా విరమిస్తే .. సర్కార్ నుంచి ప్రకటన వచ్చేదని అన్నారు. ఆది నుంచి ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మూడేళ్ల తరువాత క్రమబద్ధీకరిస్తామని.. వారికి ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్నారని కోదండరాం గుర్తు చేశారు.
ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరించారు :కానీ నాలుగు సంవత్సరాలైన ప్రభుత్వం జేపీఎస్‌లను క్రమబద్ధీకరించకపోవడంతో.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వారిని విపరీతమైన వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. సమ్మె విరమించుకోకపోతే ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరించిందని కోదండరాం ఆరోపించారు.
అన్యాయమైన, అప్రజాస్వామ్యమైన ధోరణులు మంచివి కావని కోదండరాం హితవు పలికారు. ఇవి సమాజానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోదండరాం డిమాండ్ చేశారు.