ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన అనగానే రాజకీయ, ప్రజా సంఘాల నాయకులను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయపడే పరిస్థితి నెలకొందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. నాయకులు వస్తున్నారంటే ప్రజలు సంతోషపడాలని... కష్టనష్టాలను చెప్పుకునే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వెళ్లినప్పుడల్లా నేరెళ్ల బాధితులను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.
నజర్ బంద్
గతంలో నిజాం ప్రభువులు బయటకు వస్తే ఎవరూ బయటకు రావొద్దంటూ నజర్ బంద్ ప్రకటించేవాళ్లు.. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చిందన్నారు. ఇది అప్రజాస్వామికమైన చర్య, రాచరిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజల చేత ఎన్నికయ్యారని... ప్రజల సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు.