ఉద్యోగుల జీతభత్యాల సవరణ విషయంలో తెరాస ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లు పొందడానికి హడావుడిగా ఏప్రిల్ 1వ తేదీ కల్లా కొత్త జీతాలు వస్తాయని, ఫిట్మెంట్ వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రకటన చేయించారని విమర్శించారు.
'జీతభత్యాల విషయంలో ఉద్యోగులను మళ్లీ మోసం చేశారు' - తెలంగాణ వార్తలు
ప్రజలు బలపడితేనే ప్రభుత్వాలు మాట వింటాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ఉద్యోగుల జీతభత్యాల సవరణ విషయంలో తెరాస ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు.
ప్రభుత్వం తరఫున తాము హామీ ఇస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పడంతో వారిని నమ్మి ప్రభుత్వానికి ఓట్లు వేశారన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి హడావుడిగా ప్రకటన చేశారు కానీ ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. తెరాస సర్కార్ మొదటి నుంచి మోసం చేస్తూ వస్తోందని.. ప్రజలు బలపడితేనే ప్రభుత్వాలు మాట వింటాయన్నారు. ఇప్పటికైనా ప్రజలందరు ఐక్యంగా నిలబడి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:కొవిడ్ నయమైనా జాగ్రత్తలు తప్పనిసరి.. లేకుంటే ముప్పె!