Kodandaram: కేసీఆర్ అసమర్థపాలనే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో విచిత్ర ప్రకటనలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ నెల 26న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశ వివరాలను నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ వెల్లడించారు. ఏప్రిల్ 9న తెజస కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోపాటు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నామని కోదండరాం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా జలాల పరిరక్షణ, విద్యుత్ ఛార్జీల పెంపు తదితరాలపై పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు. రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కలిసి వచ్చే వారితో కలిసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీ విలీనం గురించి చర్చ జరగలేదని కోదండరాం స్పష్టం చేశారు.