'నా కూతురు బతికితే చాలు.. బిచ్చమెత్తుకునైనా పోషిస్తా' PG student father about her health condition: వరంగల్ కేఎంసీలో ఆత్మహత్యాయత్నం చేసిన వైద్యవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెకు నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. విద్యార్థిని శరీరం మందులకు సహకరించడం లేదని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తమ చివరి ప్రయత్నం అని వైద్యులు అన్నారని బోరున విలపించారు. తన కుమార్తె ఫోన్ తనిఖీ చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.
తన కుమార్తెకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఆర్పీఎఫ్‌లో పనిచేసే తాను.. ఆత్మహత్యకు యత్నించిన ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇచ్చానని.. తన కుమార్తెకు ఇలాంటి గతి పడుతుందని అనుకోలేదని వాపోయారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్యవిద్యార్థినికి అందుతున్న ట్రీట్‌మెంట్‌పై.. ఆమె తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నిమ్స్‌లో తన కుమార్తెకు సరైన వైద్యం అందడం లేదని విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన ట్రీట్మెంట్ను అందించి తన కుమార్తెను కాపాడాలని కోరారు. వరంగల్ ఎంజీఎంలోనే సరైన వైద్యం అందినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇక్కడ ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. తన కుమార్తె ఆరోగ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదన్నారు. ఎంజీఎంలో గొడవ అవుతుందని.. ఆసుపత్రిలో పరువుపోతుందని ఇక్కడికి తరలించారని ఆరోపించారు.
తన కుమార్తెకు జరుగుతున్న వేధింపులపై స్థానిక పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పినా వారు సరిగా స్పందించలేదని వైద్యవిద్యార్థిని తండ్రి అన్నారు. దీనికి కారణమైన హెచ్‌వోడీ, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇచ్చి ఎలాగైనా బతికించాలని కోరారు. తాను జాబ్ చేయకపోయినా ఫర్వాలేదు.. బతికుంటే చాలని అన్నారు. 'నా బిడ్డ బతికితే చాలు.. బిచ్చమెత్తుకునైనా తనను పోషించుకుంటా' అంటూ విద్యార్థిని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన విలపించడం చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.
ఇవీ చదవండి: