టెక్స్‌టైల్ రంగంలో ప్రాచుర్యం పొందిన కేరళకు చెందిన కైటెక్స్.. రాష్ట్రంలో దాదాపు రూ.3,500 కోట్ల పెట్టుబడితో... భారీ పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కైటెక్స్... విస్తరణలో భాగంగా కేరళ అవతలి రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించింది. కైటెక్స్‌ను తమ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు.. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ మరో 6 రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నించాయి. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించటంతో పాటు.. కంపెనీకి భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. చివరకు కైటెక్స్ గ్రూపు తన విస్తరణ కోసం తెలంగాణను ఎంచుకుంది.
KITEX: రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కైటెక్స్ సుముఖత - తెలంగాణ వార్తలు
16:23 July 09
రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కైటెక్స్ సుముఖత
ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావటానికి... పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. కంపెనీ ప్రతినిధుల కొరకు రాష్ట్రం తరఫున ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి... రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో కంపెనీ ఛైర్మన్ సాబు జాకబ్... ఇతర ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్ సమక్షంలో టెక్స్‌టైల్, పరిశ్రమ శాఖ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను... కైటెక్స్ గ్రూపునకు కేటీఆర్ వివరించారు.
రాష్ట్రానికి కితాబు
రాష్ట్రంలో ఉన్న టీఎస్‌ఐపాస్ సింగిల్ విండో అనుమతులు... తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా... రాష్ట్రంలో సాగవుతున్న అత్యుత్తమ పత్తి పంట వంటి అంశాలను ప్రస్తావించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి... టీఎస్‌ఐపాస్ చట్టప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని... దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు... అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడుల విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు... చాలా అరుదని కంపెనీ కితాబిచ్చింది. అందుకే తెలంగాణలో పెట్టుబడి పెట్టే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రకటించింది.
వరంగల్‌లో పర్యటించిన బృందం
అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా... వరంగల్‌లో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇంత భారీ ఎత్తున.... దేశంలో ఎక్కడా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదని కంపెనీ అభిప్రాయపడింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న కైటెక్స్ బృందం... ఎంత పెట్టుబడి పెట్టనున్నారు, ఎంత మందికి ఉపాధి కల్పించనున్నారు వంటి విషయాలను పర్యటన ముగింపులో ప్రకటించే అవకాశాలున్నాయి.