Kite Deaths in Telangana :గాలిపటాలు ఎగరేయడమంటే అందరికీ ఇష్టమే. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహం కనబరుస్తుంటారు. పతంగిని మరింత ఎత్తుకు పంపించాలనే తాపత్రయంలో తమ చుట్టుపక్కల పరిసరాలపై నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ నిర్లక్ష్యమే వారి పాలిట మరణ శాసనంగా మారుతోంది. కొందరు విద్యుత్ షాక్తోనూ, మరికొందరు భవనం పైనుంచి కిందకు పడి మృత్యువాతపడ్డారు. గాలిపటాలు ఎగరేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృతి చెందారు.
పతంగి నింపిన విషాదం - మాంజా చుట్టుకుని జవాన్, గాలిపటం ఎగరేస్తూ మరో నలుగురి మృతి
Boy Dead in Hyderbad While Flying a Kite :హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గాలిపటాలు ఎగరవేస్తూ అనుమానాస్పదంగా చౌహాన్ శ్రీదేవ్ అనే యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు(Kite Deaths) ఎగరవేసేందుకు వెళ్లిన యువకుడు భవనం మూడో అంతస్తు పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగరవేస్తుండగా ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆరుగురు మిత్రులపై అనుమానంతో తండ్రి నాందేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.