Textile park: రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారును కోరింది. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్ శాఖ కార్యదర్శి యూపీసింగ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. టెక్స్‌టైల్ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల కల్పన కోసం ప్రధానమంత్రి మెగా సమీకృత టెక్స్‌టైల్ పారిశ్రామికవాడలు, అపరెల్ పార్కులు (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఈ పార్కులను ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా రూ.4445 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఏడు పార్కుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15లోగా ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది.
కనీసం వెయ్యి ఎకరాల్లో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒకో పార్కు కనీసం వెయ్యి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతంగా ఉంటుంది. తొలివిడత నిధుల కింద కొత్తగా ఏర్పాటు చేసే పార్కుకు రూ.300 కోట్లు, అప్పటికే ఉపయోగంలో ఉన్న పార్కులకు రూ.100 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. తొలివిడత ప్రాజెక్టులో 60 శాతం ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, 25 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండో విడత నిధులు మంజూరవుతాయి. రెండో విడతలో కొత్త పార్కుకు రూ.200 కోట్లు, ఇప్పటికే వినియోగిస్తున్న పార్కుకు రూ.100 కోట్లు కేటాయించనుంది. ప్రాజెక్టులను కేంద్ర టెక్స్‌టైల్ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదిస్తుంది. రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మిస్తోంది. ఈ పార్కుతో పాటు రాష్ట్రంలో 20 పార్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి మరో లేఖ రాసింది.