Kishan Reddy on Fourth Wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా నాలుగో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అయినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని రామ్‌గోపాల్ పేట్ అడ్డగుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కిషన్ రెడ్డి సందర్శించారు. ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులను వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను తెలుసుకున్నారు. కొవిడ్ సమయంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలకు తెగించి చికిత్స అందించారని వారిని అభినందించారు.
"ఇప్పటికే చైనాలో నాలుగో దశ కేసులు పెరుగుతుండటంతో దేశంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు అభినందనీయం. ప్రాణాలకు తెగించి కరోనా బాధితుల ప్రాణాలు కాపాడారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉంటే అందుకు నిధులు అందిస్తా." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి