Central minister kishanreddy: గతంలో ఉన్న నిర్మాణాలను 720 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. 30 పడకల ఆయుష్ హాస్పిటల్, యంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు అకడమిక్ బ్లాక్, హాస్టల్స్, సిబ్బందికి క్వార్టర్స్, 650 మంది కూర్చునేలా ఆడిటోరియం, సమావేశ మందిరం నిర్మాణం, ఓపిడీ బ్లాక్ వంటి అనేక నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు తరగతులతో పాటు, ప్రజలకు ఓపీడి సేవలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో కొత్త ఓపీడి బ్లాక్ నిర్మాణం, అధునాతన వైద్య సదుపాయాల కల్పన కోసం 1,032 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షయోజన పథకం క్రింద ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలకు ఒక్కోదానికి 120 కోట్ల చొప్పున మొత్తం 240 కోట్లు ఖర్చు చేసి నూతన బ్లాకుల నిర్మాణాలను చేపట్టి, అధునాతన వైద్య సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లడించారు.
ఇందులో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకలను ఏర్పాటు చేయడం, కొత్త ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, 8 నుంచి 10 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాల ఏర్పాటు, దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించడం వంటి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 902 కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,549 హెల్త్ & వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 418 ఆయుష్, 3,035 ఎస్హెచ్సీలు, 636 పీహెచ్‌సీలు, 230 యూపీహెచ్‌సీలు, 230 యూహెచ్‌సీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.