Kishan reddy on Palm Oil Cultivation : కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు 5 సంవత్సరాల కాలానికి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 15 శాతం తెలంగాణలోనే ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమం తెలంగాణ రైతులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుందని ఆయన వివరించారు.
పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, 2025-26 నాటికి పామాయిల్ సాగును 10 లక్షల హెక్టార్లకు పెంచాలని, మరో 6.5 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలన్నదే ఆయిల్ పామ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కిషన్రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకం యొక్క మొత్తం అంచనా వ్యయం రూ.11,040 కోట్లు కాగా.. అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ.8,844 కోట్లను ఖర్చు చేయనుందన్నారు.