Kishan Reddy Counter on Rahul Comments : అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఎంతో ప్రమాదకరమని మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి చెబుతూ ఉండేవారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఉపన్యాసం విని.. ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని రాహుల్ గాంధీ అన్నారని.. కానీ నాలుగు నెలలు ఆగితే తెలంగాణ ప్రజలే తేలుస్తారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే రాహుల్ గాంధీపై నమ్మకం లేక 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ గూటికి చేరిపోయారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని యువరాజు.. పగటి కలలు కని ఊహా లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Kishan Reddy Fires On Rahul Gandhi : బీజేపీ బీ టీం అనడం అంటే.. మిడిమిడి జ్ఞానంతో అవగాహన లేమితో మాట్లాడటమేనని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి చురకలు అంటించారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే నాయకుడిగా ఎదిగాడని.. ఇద్దరి డీఎన్‌ఏ ఒకటే.. రెండూ కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ తమకు ఎంత దూరమో.. బీఆర్‌ఎస్ కూడా అంతే దూరమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో ఎప్పుడూ కలిసి పని చేయలేదని.. భవిష్యత్తులోనూ కలిసి పని చేసే అవకాశమే లేదని వెల్లడించారు. అలాగే మజ్లిస్‌ను పెంచి పోషించిన ఘన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్‌దని.. ఊరేగిస్తున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని దుయ్యబట్టారు.