Kishan Reddy Reaction on Kaleshwaram Project Damage : రూ.లక్ష కోట్లకు పైగా నిధులు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. రూ.30 వేల కోట్లతో అయిపోయే దానికి లక్ష 30 వేల కోట్లకు పెంచి దోచుకున్నారని ఆరోపించారు. పిచ్చి తుగ్లక్ డిజైన్‌తో నిర్మించారని ధ్వజమెత్తారు. అధికారుల నోళ్లు నొక్కి కేసీఆర్ ఇష్టానుసారంగా కట్టిన ప్రాజెక్ట్ అని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రమే విజయం సాధించారని ఎద్దేవా చేశారు.
Kishan Reddy Comments on KCR: కేసీఆర్(KCR) చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే.. దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామ్‌కి సంబందించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసీఆర్ రాజీనామా చేయాలని అన్నారు. ప్రాజెక్ట్ విషయంలో న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులపై కేంద్రం అజమాయిషీ ఉండదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూపర్ ఇంజనీర్‌గా మారి నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకుండా కేసీఆర్ ఆదర బాదరాగా ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా చూపించుకోవడం కోసమే కేసీఆర్ ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు.మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda Project) విషయంలో కేసీఆర్, ఆయన కుటుంబం ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. డ్యామ్ భద్రత కోసమే కమిటీ పర్యటన జరుగుతుందని తెలిపారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ అడిగిన వివరాల్లో అరకొర సమాచారమే ఇస్తున్నారని మండిపడ్డారు.