కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడను కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. తెలంగాణకు కేటాయించిన ఎరువులపై చర్చించారు. ఎరువుల సరఫరాపై పర్యవేక్షిస్తామని సదానంద గౌడ చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు అవసరమైన యూరియాను పంపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
కిషన్‌రెడ్డికి వివరణ..
2020 ఖరీఫ్ సీజన్ మొత్తానికి.. తెలంగాణకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయని కిషన్‌రెడ్డికి ఎరువుల మంత్రిత్వశాఖ అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు.. 8 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా.. 10.17 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 8.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్లు కిషన్‌రెడ్డికి వివరించారు. గతేడాది ఇదే సీజన్‌లో 5.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించినట్లు తెలిపారు.
ఎరువుల సరఫరాపై సదానందగౌడతో కిషన్‌రెడ్డి భేటీ 1.49 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు..
ఆగస్టులో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉందని.. 4.52 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తాన్ని అందుబాటులో ఉంచినట్లు అధికారులు కిషన్‌రెడ్డికి వివరించారు. ఆగస్టు 31 నాటికి తెలంగాణలో 1.49 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోసం అభ్యర్థనలు అందగా.. 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించామన్నారు. ఈనెల రెండో వారానికి తెలంగాణకు సమీపంలోని ఓడరేవులకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
కేంద్ర ఎరువుల విభాగం.. తెలంగాణ రాష్ట్ర ఎరువుల అవసరాలను నిశితంగా పరిశీలిస్తుందని, క్షేత్ర స్థాయి అవసరాలను తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు.. సదానంద గౌడ సమక్షంలోనే కిషన్ రెడ్డికి వివరాలు అందించారు.
ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులుతో సమీక్ష నిర్వహించిన కిషన్‌రెడ్డి.. పెరిగిన సాగుకు సరిపడా ఎరువుల సరఫరాపై ఆరా తీశారు. ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రప్రభుత్వం కోరినట్లుగానే ఎరువులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి:రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్‌రెడ్డి