Kishan Reddy Meet Pawan Kalyan in Hyderabad : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో(Pawan Kalyan).. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏలో జనసేన కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సావధానంగా చర్చలు నిర్వహించారు.
Telangana Assembly Elections 2023 :జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, కమలం అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని గుర్తు చేశారు. బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని.. ఇదే విషయాన్ని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్నారని వారికి తెలిపారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
Mulakhat with Chandrababu: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు
అంతకుముందు పవన్ కల్యాణ్.. జనసేన రాష్ట్ర కార్యాలయంలో.. తెలంగాణ జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల పోటీపై పార్టీ నాయకుల్లో సందిగ్ధత ఏర్పడంతో తమ అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్లు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. గత ఎన్నికలు జరిగినప్పుడు.. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని పోటీకి దూరంగా ఉన్నామని తెలిపింది. పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందనే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది.