Kishanreddy Latest Comments : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కిషన్‌రెడ్డి... హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆరోపణలు గుప్పించారు. రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాల గురించి పలు విషయాలు వెల్లడించారు.
Kishanreddy on PM Kisan Seva Centers : రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్ దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రాలను రేపు ప్రధాని మోదీ రాజస్థాన్‌లో ప్రారంభిస్తారన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు నిర్వహిస్తారన్నారన్న ఆయన.. వ్యవసాయానికి కావాల్సిన పరికరాల అమ్మకాలు, కిరాయికి ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
'వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. గురువారం నుంచి 'రైతు వద్దకు బీజేపీ' కార్యక్రమం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతులకు వివరిస్తాం. 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్‌గ్రేట్ చేస్తాం. వీటిలో తొలిదశలో రేపు లక్షా 25 వేల షాపులను ప్రధాని ప్రారంభిస్తారు. రేపటి నుంచి సల్ఫర్ కోటెడ్ యూరియాను అందుబాటులోకి తెస్తున్నాం. రేపు 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గురువారం రోజున 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ. 17,500 కోట్లు ప్రధాని జమ చేస్తారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులు జమకానున్నాయి'-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు