విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి (Gangapuram Kishan reddy)రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడై.... విద్యార్థి దశలోనే జనతా పార్టీలో చేరారు. టూల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కిషన్‌రెడ్డి... 1980 నుంచి 1994 వరకు భాజపా (Bjp) కార్యాలయంలోనే నివాసముంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1980లో భాజపా రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్ బాధ్యతలతో ప్రారంభం కాగా... 2002లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.
2004లో మొదటిసారి ఎమ్మెల్యే...
2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి... 2009లో అంబర్‌పేట్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2010లో ఉమ్మడి రాష్ట్ర భాజపా పగ్గాలు స్వీకరించి... నాలుగేళ్ల పాటు ఏపీ అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా చివరి అధ్యక్షుడిగా.. తెలంగాణ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత కిషన్ రెడ్డికి దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా... మరుసటి ఏడాది 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలిసారి ఎంపీ అయిన కిషన్‌రెడ్డికి మోదీ మంత్రివర్గంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా స్థానం దక్కింది.
మోదీతో కలిసి యూఎస్ పర్యటన...
విద్యార్థి దశ నుంచే సమస్యలపై పోరాడే నైజం ఉన్న కిషన్‌రెడ్డి... హైదరాబాద్‌లో భాజపా చేపట్టిన అన్ని ఉద్యమాల్లోను కీలక పాత్ర పోషించారు. యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయం నుంచి నేపాల్ సరిహద్దు బిహార్ వరకు సరిహద్దు భద్రతా చైతన్య యాత్ర- సీమా సురక్షా జాగరణ యాత్ర నిర్వహించి... దేశ సరిహద్దుల్లో నివసించే ప్రజల్లో చైతన్యం నింపారు. 'వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ టెర్రరిజం' అధ్యక్షుడిగా తీవ్రవాద ప్రభావిత దేశాల్లో పర్యటించి... అనేక ఉగ్రవాద వ్యతిరేక సదస్సుల్లో కిషన్‌రెడ్డి ఉపన్యసించారు. 1994లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు నాడు గుజరాత్ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నేటి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భాజపా ప్రతినిధిగా కిషన్‌రెడ్డి అమెరికా ప్రభుత్వ పనితీరు, ప్రజల జీవన విధానాలపై అధ్యయనం చేసేందుకు 45 రోజుల పాటు యూఎస్‌లో పర్యటించారు.