Kishan Reddy Fires On TRS Activists Attack: హైదరాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. అర్వింద్ నివాసానికి వెళ్లిన ఆయన ఉదయం జరిగిన దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోవాలనే కోరిక తమకు లేదని కిషన్‌రెడ్డి అన్నారు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం తమకు లేదని పేర్కొన్నారు. తాయిలాలు ఇచ్చి బీజేపీలో చేర్చుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చే వాళ్లనే చేర్చుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నేర్పరితనంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్ మీదే పెట్టాలని అన్నారు. కేసీఆర్ ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతులు నొక్కారో అందరికీ తెలుసునని ఆరోపించారు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే మోదీని ఢీకొంటున్నట్లు ఇతరులు అనుకోవాలని.. ఈ చర్యలకు పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారని గుర్తు చేశారు. పోలీసులు, మజ్లిస్‌ను అడ్డుపెట్టుకుని తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.