Kishan Reddy Fires on Telangana Government: కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను.. రాష్ట్ర ప్రభుత్వం భక్షించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబం, బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలకు.. తెలంగాణ బంగారు గని బలైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి అప్పులు రూ.10,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. కార్మికులపై పని భారం విపరీతంగా పెంచేశారని అన్నారు. దిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉంది:సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులోని కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు భక్షిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వం పాల్గొనట్లేదని విమర్శించారు. టెండర్లు కూడా వేయకుండా బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల దృష్ట్యా కొత్త పల్లవి అందుకున్నారని.. ప్రధానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
అలా చేస్తే కార్మికులు ఊరుకోరు:ఈ క్రమంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. విశాఖ కార్మికుల పాలిట దేవుళ్లమని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. సింగరేణి సొమ్మును.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెడితే కార్మికులు ఊరుకోరని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"సింగరేణిలో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. సీఎం కుటుంబం, బీఆర్ఎస్ నేతల జోక్యం పెరిగిపోయింది. సింగరేణి అప్పులు రూ.10 వేల కోట్లకు పెరిగింది. కార్మికులపై పని భారం విపరీతంగా పెంచేశారు. సింగరేణిని కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ నాయకులు భక్షిస్తున్నారు. సింగరేణి సొమ్ము విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెడితే కార్మికులు ఊరుకోరు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి