Kishan Reddy Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీల నుంచి తమ పార్టీకి మద్దతు రావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారన్న ఆయన.. ఆ పార్టీ ప్రచార వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా తమ మేనిఫెస్టోను రూపొందించామన్న కిషన్రెడ్డి.. మన మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా పేరుతో ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫేక్ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీల పాలన అవినీతిమయమైందని.. ఆ రెండు పార్టీల నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీల నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు.
నేడు రాష్ట్రానికి అమిత్ షా- 23 తర్వాత అగ్రనేతల విస్తృత ప్రచారం
"బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఆ పార్టీ ప్రచార వాహనాలను స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోను రూపొందించాం. బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందిస్తాం." - కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
Kishan Reddy On Corruption in Telangana :ముఖ్యమంత్రి అవినీతిపై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను కేసీఆర్ సర్కార్ దెబ్బ తీసిందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న ఆయన.. బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.